ఎంతెంత దూరం


అరగంట వ్యవధిలో అయిదుసార్లు ఆ గదిలో సగం సామాన్లు అటుదిటూ- ఇటుదటుగా మారి మిగిలిన సగం పక్కగదిలోకి బదిలీ అయ్యాక కూడా నేను  సంతృప్తిగా తలాడించక పోవడం చూసి అప్పటికిక  ఓపిక పూర్తిగా నశించిపోయిన సరస్వతమ్మగారు   "మీకు తాగడానికిచల్లగా ఏదైనా తీసుకొస్తానంటూ", నెమ్మదిగా ఆ గదిలోంచి జారుకున్నారు. ఆవిడ వెనకాలే తోకలా తిరుగుతున్న, నల్ల గౌను వేసుకొని తెల్లగా పొట్టిగా వున్న ఆ పదేళ్ళ పిల్ల కూడా నావంక విసుగ్గా చూస్తూ వెళ్ళిపోయింది. ఈ గదిలో నాచే 'గెట్ అవుట్' అనిపించుకున్న ఫోన్ పక్కగదిలో కుయ్య్ మంటూ అరవడం వినిపించాకే ఆవిడ ఇక్కడినుండి కదిలారన్నది సత్యం. అదే నేనూ నమ్ముతాను, ఎందుకంటే ఆ ఫోన్ కాల్
ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలుసు.... ఆ కాల్ రిసీవ్ చేసుకోవడం ఆ సమయంలో ఆమెకు అత్యంత ముఖ్యమైనవిషయం. దాని తర్వాతే తలూపటాలు, తటపటాయించడాలూనూ.

        ఇరవెైనిముషాల తర్వాత చేతిలో ఆరంజి రంగులో కనబడుతున్న పళ్ళరసం సీసా, దాన్నెత్తిన బోర్లించిన స్టీలుగ్లాసు, చంకలో ఒక ఫ్లాస్కు పట్టుకొని బరువెైన శరీరం కావడంతో ఆపసోపాలు పడ్తూ, మెట్లెక్కి రావడంతో ఆయాసపడుతూ గదిలోకి  వచ్చారు. అంత త్వరగా వచ్చిన ఆవిడను చూసి విసుక్కుంటూనే ఆవిడ వద్దనున్నవస్తువులందుకొని అలమరాలో పెడ్తుండగా కనిపించిందది. అప్పటివరకూ నా ధృష్టి అంతా గదిగోడల మధ్యే తిరుగుతున్నది కదా! అందుకే ఇంతవరకూ కనబడినట్టులేదు. అల్మరాకు ఎదురుగా గుమ్మం పక్కనే వున్న గోడకు తగిలించిన కొంచెం పాతబడినట్లున్న క్యాలండర్. నేను దానికి దగ్గరగావెళ్ళి పరిశీలనగా చూడడం గమనించి "అదిరెండేళ్ళ కిందటిదే, కాని గదిలో ఒక దేవుడి  బొమ్ముంటే బాగుంటుందని తీయలేదు. మీ అమ్మగారు కూడా మీ గదిలో దేవుడి బొమ్మ తప్పకుండా వుండాలని మరీమరీ చెప్పారు అవినాష్ బాబు!". ఇంతకుముందులా మౌనంగా చూస్తూ ఉండకుండా ఆవిడ అలా ముందుగానే  చెప్పేస్తున్నారంటే దాని వెనుక ఇందాకటి ఫోన్ కాల్ ప్రభావం ఉన్నట్టే. పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల్లో ఒకటో  తారీఖు నుండి ముఫ్ఫయ్యో తారీఖు దాకా ఆ నెలలో పండగలూ, విశేషాలతో పాటూ పాలలెక్క, గల్లంతైన న్యూస్ పేపర్ల గుర్తుగా ఆయా తేదీల
చుట్టూ రెడ్ ఇంక్ తో ఇంటూ మార్కు, రౌండ్ చుట్టడాలూ. ఇవన్నీ నాలుగుచేతులతో గంభీరంగా నిలుచున్న నిలువెత్తు దేవుడితో పాటూ కళ్ళకు కనువిందు చేస్తున్నాయ్. నా విస్తృత పరిశీలనను ఏమాత్రమూ పట్టించుకోక "పళ్ళరసం తాగి మీరు విశ్రాంతి తీసుకోండి. నేను తరువాత కలుస్తా", అంటూ ఈసారి తన భారీ శరీరాన్ని తమాషాగా ఊపుకుంటూ హుషారుగా వెళ్ళిపోయారావిడ. కొంచెంసేపు హు... హుహూ.. దవడలు లోపలికి నొక్కుకుంటూ నోటితో శబ్దం చేసుకుంటూ ఉండిపోవలసి వచ్చింది. నేనేం కావాలనుకొని ఇక్కడకి వచ్చానో అది సవ్యంగా జరుగుతుందా అన్నది అనుమానంగానే వుంది. దీనికంతటికీ  కారణం ఇంకెవరు? అమ్మే! తను వద్దన్నా వినకుండా ఒక్కడినే ఇక్కడికి వచ్చానని, సరస్వతమ్మగారి ద్వారా ఫోన్లో ఎప్పటికప్పుడు నా గురించి వివరంగా తెలుసుకుంటూ- అక్కడి నుంచే ఆదేశాలు జారీచేస్తూ, ఏకాంతంగా వుండాలన్న నా అభిలాషకు ఇలా అవరోధాల నగిషీ అందంగా నప్పిందో లేదోనని ఎప్పటికప్పుడు తనిఖీ చేయిస్తూనే వుంది. ఈ విషయంలో నేను మరీ అంత మూర్ఖంగా ఏమీ ప్రవర్తించలేదే!? అసలు నేను వెళ్ళాలనుకున్న చోటు ఇదికాదు. అక్కడ మనవాళ్ళంటూ ఎవరూ లేరని, ఎక్కడో మారుమూలనున్న ఆ ఊరికి ఎలాంటి సదుపాయమూ లేదని, ఇక్కడికెైతేనే ఒప్పుకుంటానంటే సరే అని ఊరుకున్నాను కదా! అక్కడితో ఆగారా!? నాన్న ఫ్రండ్ 'జోసెఫ్' అంకుల్ని రెగ్యులర్ గా కలుసుకుంటానని నాన్నకు  మాట కూడా యిచ్చాను. అయినా వీళ్ళు వదిలిపెట్టడంలేదు. ఇందాక లగేజ్ సర్దుకుంటుంటే  బ్యాగులో ఓ పెద్దకవరు. ఏంటా! అనిచూస్తే అది అమ్మరాసిన నాలుగు పేజీల ఉత్తరం. ఇంకేముంటుందందులో! మొత్తం ఓ వంద జాగ్రత్తలు, మరో రెండు వందల సలహాలతో నిండి పోయివుంటుంది. అందుకే చదవకుండా అలానే అడుగున పడేసా. ఇలాంటి పనుల వల్ల ఎంత చిరాకేస్తుందో! అప్పటికీ ఓపికగా చెప్పా. నేను రాసుకునేటప్పుడు నిశ్శబ్దం నాకెంతో ముఖ్యమని. "అంతేకదా! ఆ రాసుకునేదేదో ఇక్కడేరాసుకో. నాన్నా, నేనూ మౌనవ్రతం చేస్తాం", అంది అమ్మ. "అలా ఎలా కుదురుతుంది? నీకెలా చెబితే  అర్ధమవుతుంది?", అని విసుక్కుంటే శబ్దం చేయకుండా ఏడుపు మొదలెట్టింది. "మీరేంటి నాన్నా ఏం మాట్లాడరు" అని నాన్నని ప్రశ్నిస్తే "మీరిద్దరి వాదన్లో నాకెప్పుడు చోటుంటుంది? మీరేతేల్చుకోండి", అని ఎప్పటిలాగే ఆయన మౌనంగా తప్పుకోవడంతో, నేనా ఊరిలో వున్నంతకాలం తన స్నేహితుడిని తరచుగా కలుసుకుంటూ వుండాలనే ఆయన డిమాండుకూ ఒప్పుకోవలసి వచ్చింది. నేనిక్కడికి వచ్చాక అమ్మ నాన్నతో బాగా గొడవ పడివుంటుంది. ఆ సాకుతో ఇక నాన్నని రోజూ సతాయిస్తూ వుంటుందనుకున్నాను. అక్కడ నాన్న సంగతేమోగాని, ఇక్కడ నన్నూ సతాయిస్తుంది కదా ఈ సరస్వతమ్మగారి ద్వారా. జరిగిందంతా ఇప్పుడు గుర్తుకురావడంతో నిశ్శబ్దంగా వున్న గదిలో గాలిని ఎవరో బంధించేసినట్లుంది. గొంతులో తడారిపోయి ఒకటే దాహంగా వుంది. అలమరాలోంచి పళ్ళరసమున్న సీసామూత తీసి ఆస్వాదించకుండా గుటగుటా తాగేసినా ఇంకా దప్పిక తీరక ఆపైన ఫ్లాస్కులో ఏముందోనని మూతతీసి చూస్తుంటే, ఎక్కడో కిసుక్కుమని నవ్విన చప్పుడు. అబ్బా... శరీరంలో సున్నితమైన చోట సన్నని కత్తి కసుక్కుమని గుచ్చుకున్న బాధ. అయినా గదిలో ఎవరూ లేరుగా... ఆ నవ్వు నా కోసం కాదనుకుంటూనే గది చుట్టూ చూసుకున్నా. ఎవరూ లేరు. నా బాధ ఇసుమంతయినా తగ్గలేదు. గుమ్మం కెదురుగానున్న కిటికీ దగ్గరకెళ్ళి నిలబడ్డా, ఎదురుగా కనబడుతున్న కాంపౌండ్ గోడని ఆనుకొనివున్న ఖాళీ స్ధలంలో నల్లగౌను పిల్ల బంతిని ఎగరేసి పట్టుకుంటూ ఆడుకుంటూంది. బాలు కిందపడ్డప్పుడు నవ్వుకుంటూ దాన్ని కాళ్ళతో ఎడాపెడా తన్నుకుంటూ చేతుల్లోకి తెచ్చుకొని గాల్లోకి ఎగరేస్తూ... నా కళ్ళకది మామూలు ఆటలా కనిపించడంలేదు. ఆ పిల్ల చేతిలో నున్న జీవంలేని బంతిపై జాలి- పిల్లపై ధ్వేషం కలుగుతూంది. ఆ పిల్ల నెత్తిన మొట్టి బాల్  లాక్కొచ్చెయాలనుంది. "ఇందుకేకదరా! నువ్వూ, నీ చేష్టలను తేడా అనేది", పక్కనేవుండి అమ్మ చీవాట్లు పెట్టినట్లుంది. చదువుతున్న న్యూస్ పేపరులో తల దాచుకుని నవ్వుతున్న నాన్న కనబడుతున్నారు. నా పెదవులపై నవ్వులవాన ఆగకుండా కురుస్తూంది. ఇందాకటి దాహం ఇప్పటికి తీరినట్లైంది.
                        ఏకధాటిగా రాయాలనుకున్న నా రచనకు అడ్డంకులు యెదురవుతున్నా ఆపకుండా నెమ్మదిగానైనా కొనసాగిస్తూనేవున్నా. నేను చెప్పింది ఫాలో అవడం సంగతి అటుంచి, అమ్మ చెప్పింది మాత్రం తు- చ తప్పకుండా పాటించే సరస్వతమ్మగారిని చూసీ- చూడనట్టు  వదిలేయడం నాకు బాగా అలవాటయిపోయింది. అలాగే ఆ నల్లగౌను పిల్లకూడా. ఆ పిల్లను, ఆ పిల్లచేష్టలను చూడకూడదనుకుంటూనే చూసేసి, ఆనక ఆ పిల్లను తిట్టుకోవడం, నా మూడ్ పాడుచేసుకోవడం, సరిగా రాయలేకపోతున్నానని తెగ బాధపడిపోవడం, ఇలాగైతే సకాలంలో పూర్తి
చేయగలనో లేదోనని మరింత సమయం వృధా చేసుకోవడం, అన్నీ ఒకదాని తర్వాత ఒక్కోక్కటి గొలుసుకట్టుగా జరుగుతూ వుంటుంది. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేయాలనే బలమైన కోరిక వల్ల ఇప్పుడిప్పుడే ఆ చిరాకునుండి తొందరగానే బయటపడుతున్నా. ఒక్కోసారి అలా షికారుకెళ్దామని గదిలోంచి బయటకురావడమే తొందర... నా దారికి అడ్డంగా నిలబడి "ఇప్పుడెక్కడికి అవినాష్ బాబూ", ఈ సమయంలో బయట మంచుపడుతుందనో, చల్లగాలి ఎక్కువైందనో, బాగా ఎండకాస్తుందనో... నన్ను వెళ్ళనీకుండా చేయడానికి సరస్వతమ్మగారి దగ్గర  అమ్మ చెప్పిన సవాలక్ష జాగ్రత్తల జాబితాలోవన్నీ వరుసగా ఒకదాని తరువాత ఒకటి... నేను వెనక్కి తిరిగిగదిలోకి వెళ్ళేంతవరకు... ఆగకుండా వస్తూనేవుంటుంది.
   ఒకవేళ నేను అవేమీ పట్టించుకోకుండా  బయటకు వెళ్ళిపోతే... గదికి తిరిగి వచ్చేప్పటికి జోసెఫ్ అంకుల్ నుండి సందేశం పట్టుకొని వస్తాదులా వుండే మనిషి గుమ్మం ముందు నిలుచోనుంటాడు. "సార్ ఉన్నపళంగా పిలుచుకు రమ్మన్నారు", అని పిలుపు. రానంటే  ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాడేమో అన్నట్లుంటాడు. రోగులూ, బైబిలూ తప్ప మరే సంగతీ మాట్లాడని జోసెఫ్ అంకుల్ తో మాట్లాడాలంటే నోట్లోంచి ఒక్కమాటా రాదు. ఆయన చెప్పే మాటలు వినబుధ్ధీ కాదు. అమ్మ కోపంగా చెబితే, ఈయన వాటిని తీయని పాకంలో ముంచి చెబుతాడంతే. నేనిక్కడకు ఒక్కడినే రావాలనుకున్న నా నిర్ణయాన్ని ఎప్పటిలాగే కోపంగా కాకుండా ఈసారి  తన అలకతోనో, ఏడ్పుతోనో నన్ను గెలవాలని చూసింది అమ్మ. ఈసారి మాత్రం నేను చాలా మొండివాడిలా ప్రవర్తించా. నేనిలా గట్టిగా పట్టు పడడం ఒకవిధంగా అమ్మ దగ్గరే నేర్చుకున్నానేమో నేను ఏడోతరగతి చదివేప్పుడు 'కాచి పిన్ని'కి పెళ్ళికుదిరింది. పెళ్ళి ఫిభ్రవరి నెలాఖరులో. ముహూర్తం రోజుకు వారం రోజులముందే అమ్మను ఊరికి తీసుకెళ్ళడానికి తాతయ్య వచ్చారు. అమ్మతో పాటూ నేనూ వెళ్ళాలన్నా. సంవత్సర పరీక్షలు దగ్గరలో వున్నాయని పెళ్ళికి ముందురోజు నానమ్మ, నాన్నతో కలిసి రమ్మంది అమ్మ. నేను ఒప్పుకోలేదు. అమ్మతో వెళ్ళాలని గట్టిగా ఏడ్చా. గొడవపడ్డా. అమ్మ బ్యాగులో సర్దుకున్న బట్టలన్నీ బాతురూములో పడేసా. నేనెంతగా ఏడ్చి గోల చేసినా అమ్మ నిర్ణయంలో ఏమార్పూరాలేదు. నాన్నకు నన్నప్పగించి తాతయ్యతో ఊరెళ్ళింది. ఆ తరువాత పెళ్ళిలో నాకు బోలెడన్ని బహుమానాలతో స్వాగతం పలికి తనపై కోపం పోయేలా చేసుకుందిలే. ఆ సంఘటన తరువాతే నాకు కూడా చదువు మీద శ్రధ్ధ పెరిగి ర్యాంకులు  తెచ్చుకోవడం మొదలెైంది. అందుకే ఇవన్నీ బాగా గుర్తుండి పోయాయి. నేనిలా వచ్చాక, అమ్మ నన్ను తలచుకొని కోపం చేసుకున్నప్పుడు, నాన్న ఈ సంగతి ఖచ్చితంగా గుర్తు చేసి అమ్మ దగ్గర మరిన్ని చీవాట్లు తినివుంటారు. నాన్న అవస్ధను తల్చుకుంటే బాధగావుంది. ఇదంతా నావల్లనే కదా ఇంక ఎంతమాత్రమూ ఆలస్యం చేయకూడదు. తొందరగా నా రచన పూర్తి చేసేయాలి. అసంపూర్ణంగా వుందనుకున్న చోట మార్క్ చేసి పేజీ మడత పెట్టా. ఇంకా, అక్కడక్కడ కొన్ని పేజీలు ఖాళీగా వుంచేసాను, తప్పులు సరిదిద్దుకునేప్పుడు అవసరం కావచ్చు.
       ఇక్కడకి వచ్చిన మొదట్లో ఇబ్బందిగా అనిపించినవన్నీ రానురాను నాకు అనుకూలంగా
మారిపోయినట్లుంది. అందుకు కారణం ఇక్కడ మనుషుల్లో మార్పు ఎంతమాత్రమూ కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే నాపైన ఆంక్షలు ఇంకా ఎక్కువైనట్లే. తప్పనిసరిగా పరిస్ధితులకు నేను    తలవంచడమే సరెైన కారణం... ఈ విషయంలో
మునుపు వచ్చినట్లు కోపం కూడా రావడం లేదు. ఇక్కడలేకపోయినా నా దినచర్య అంతా అమ్మ కోరిక ప్రకారం వుంటున్నట్టే. ఈ విషయంలో నాతో గొడవపడడానికి ఈసారి అమ్మకు ఏ పాయింటూ చిక్కదు.
                రాత్రి ఎంత ఆలస్యమైనా నా రచన పూర్తి చేసేయాలనుకున్నా. అనుకున్నట్లుగానే   అర్ధరాత్రి దాటిన రెండు గంటలకు పూర్తి చేసేసాను. రాబోయే సూర్యోదయం నాకెంత ఆనందాన్ని మోసుకొస్తుందో తెలుసు కాబట్టే బారెడు పొద్దెక్కినా నేను పడుకునేవున్నాను. అయితే గదిలో నేను ఒంటరిగాలేను. నేను రాసుకునే టేబుల్ దగ్గర జోసెఫ్ అంకుల్ నెమ్మదిగా బైబిల్ చదువుకుంటున్నారు. అయినా అవి నా చెవులకు బాగానే వినబడ్తూంది. ఇప్పుడు కూడా సరస్వతమ్శగారు నాకెదురుగా వుండకుండా అలమరా దగ్గర చేస్తున్న చప్పుడు కూడా వినబడుతూంది. నేనెవరినీ వారించడం లేదు. కాని, నేనెంతో ఆశగా ఎదురుచూస్తున్న చప్పుడు బార్లా తెరిచిన తలుపుల దగ్గర వినపడడం మొదలెైంది. నల్లగౌను పిల్ల నాకు చాలా దగ్గరగా నిలబడివుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచాను. ఆ పిల్ల చేతుల్లోని బంతిని చూసి నా పెదవులపై పాకిన చిరునవ్వుకు బదులుగా మొదటిసారి ఆ పిల్లనవ్వింది. హమ్మయ్య! నేనిక్కడకి వచ్చేముందు అనుకున్న రెండు పనులలో ఒకటి దిగ్విజయంగా పూర్తయ్యింది. అది అమ్మ, నాన్నల జీవితంలో  నేను రాబోతున్నానన్న విషయం వారికి  తెలిసినప్పటినుండి ఇప్పటివరకూ మా ప్రయాణం అందమైన నా అక్షరాలతో రమ్యంగా రాసుకున్న పేజీలు ఫైలు రూపంలో వారందుకోవాలని నా పక్కనే ఎదురుచూస్తూ.... ఇక రెండోది కూడా... నాన్నచెంత, అమ్మ ఒడిలో తుదిశ్వాస వదలాలన్న నా కోరిక కూడా ఇంక ఏమాత్రమూ ఆలస్యం లేకుండా కాసేపట్లోనే
తీరబోతుంది.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు