సిరిమల్లెలకబుర్లు

 ఆరంభం నుండీ భగభగమంటూ వచ్చిన ఎండలు తగ్గుముఖం పడ్డాయి.   మాట కా మాటా చెప్పుకోవాలి. అదేంటో  మండుటెండల్లోనే మల్లెపూలు పూస్తాయి. అవేమో సుతిమెత్తనివి. పూవువిరుస్తుంటే గుప్పుమంటూ సువాసన.విచ్చుకున్న తరువాత ఎక్కువసేపు తాజాగా ఉండవు, వాడి పోతాయి.కానీ, వాలు జడలోమల్లెలదండలు అలా పొడవుగా నాలుగువరసలు  పెట్టుకున్నా, చిక్కగా కట్టిన పూలు కొప్పుచుట్టూఅలా చుట్టుకున్నా ఎంత బాగుంటుందో!

ఇంటి ముందున్న ఖాళీ స్థలం లోనో,లేక పెరట్లో ఓ మూలన గుబురుగా పెరిగిన మల్లెపొద ఎండాకాలం వచ్చేముందుగా నా సీజన్ వచ్చేస్తోంది రారమ్మని పిలుస్తూంది. ఆకులన్నీ దూసి చెట్టు మొదట్లో తవ్వి పాదు చేసి రోజూ  నీరు పోస్తూ వుంటే చాలు. చిగుర్లతో పాటుగా మొగ్గలు వచ్చేస్తాయి.ఇక రోజూ పూలు పూస్తాయి.మొగ్గలయిపోయాక కొమ్మలు చివర్లు కత్తరిస్తుంటే మరలా చిగుర్లు వేస్తూ మొగ్గలొస్తాయి. రోజూ సాయంత్రం కాస్త ఎండ తగ్గగానే మొగ్గలు కోయడం, వాటిని దారంతోనో, అరటినారతోనో చిక్కగా దండలు కట్టడం ఎండాకాలం లో భలే కాలక్షేపం. ఇరుగుపొరుగు ,స్నేహితులకు , తెలిసిన వారికి పూలు పంచడంకూడా. బంధాలన్నీ పూల పరిమళాలతో  మరింత దగ్గరవుతాయి కదా!

చిన్నప్పుడు నెల్లూరులోచిన్న బజార్లో,కూడలి దగ్గర వెదురు బుట్టలలో మల్లెపూలు సేర్లతో కొలిచేవారు. చీకటిపడేకొద్దీ ధర తగ్గించేసి కొసరు ఎక్కువేసి అమ్మేసేవారు. బజారంతా విరిసిన మల్లెల సువాసనలు ప్రతి ఒక్కరినీ  పూలుకొనుక్కునేలా ప్రేరేపించేవి.విరిసిన పూలు కట్టడం కొంచెం కష్టమే.త్వరత్వరగాకట్టేసి తల్లో పెట్టేసుకోవాలి.మల్లెలు పూస్తున్నంతవరకూ దేవుళ్ళు, పితృదేవతల పటాలకు ప్రతిరోజూ  పూలసరాలతో అలంకరించాలసిందే.

చిన్నప్పుడు మేమున్న ప్రతి ఇంటిలో మల్లె చెట్టు ఉండేది.నెల్లూరులోమల్లెచెట్టు  మా కాంపౌండ్ లో పక్కింటి వారివైపుండేది.అవి పూలు పూసే సమయానికి  మేము అమ్మమ్మా వాళ్ళూరు వెళ్ళిపోయేవాళ్ళం. పొదలకూరు లో వున్నయింటిలో చిన్న మొక్క వుండేది. పెద్దగా చిన్నిగులాబిపూవంత మల్లెపూవు

పూసేది. పూవుని రెండు ఆకులతో పాటుగా కత్తరించి తల్లో పెట్టుకుంటే  మల్లెపూవు అంటే మా ఫ్రెండ్స్  ఎవరూ నమ్మేవారు కాదు.  రాపూరు లో ఇంటిముందు పెద్ద చెట్టు ఉండేది.రోజూ పూలు కోయాలంటే పెద్ద పని. సాయంత్రం కోరకుండా పొద్దున కోస్తే పువ్వులు బాగా విచ్చుకుని బాగుంటాయి అని కోస్తుంటే దారినపోయే వాళ్ళు ఆగి,” అలా కోయకండి. చెట్టునిండా పువ్వులు విచ్చుకుని  దిష్టి తగులుతుంది”. అని చెప్పేవారు.పూలు పూసేంతవరకూ తెలిసిన వారికి,అడిగినవారికి లేదనకుండా ఇచ్చేవాళ్ళం. తీసుకున్నవారి కళ్ళలో ఎంత ఆనందమో! సూళ్లూరుపేట ఇంటి వెనకాల పెద్ద పెరడు వెనుక వీధి వరకుండేది.బావి, దానిమ్మ చెట్టు వెనకాల స్ధలంలో రాళ్ళు,ముళ్ళ చెట్లు తీసివేశాకగానీ మల్లె చెట్టు కనిపించలేదు. కొంచెం శ్రద్ధ చూప గానే చెట్టు నిండా మల్లెమొగ్గలు. ఇప్పుడు కూడా కాళహస్తి ఇంట్లో కుండీలో చిన్న మొక్కని పెంచుతూ ఉంది అమ్మ  వచ్చే ఎండాకాలానికి  పువ్వులిస్తుందేమో చూడాలి.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు