పొద్దున్నే పుట్టిందీ... చందమామ.

ఈరోజు వంట ఏం చేయాలి!? హాల్లో  సోఫాలో కూర్చోని  ఫాన్ కింద హాయిగా పేపర్ చదువుతున్న తనకి   రాత్రి నా సుకుమారమైన చేతులతో శుభ్రంచేసిన అందాల పింగాణీ కప్పులో పొగలుగక్కుతున్న  ఫిల్టర్ కాఫీ ని అందిస్తూ అడిగా.
ఇక్కడ మనకేమో (అంటే 'నాకే ' అని అన్నమాట )తనతో కలసి కాఫీ తాగుతున్నంత సేపూ కాసిని కబుర్లు చెప్పుకోవాలని కూసింత ఆశ.   అబ్బే... ఈ దిన పత్రికలున్నాయి చూసారూ... మొగుడూ పెళ్ళాల మధ్య పోట్లాట కు కారణమయ్యే  మొదటి పదికారణాలలో  ఇదీ వొకటి. 
విన్నాడా.. వినలేదా..   ఎవరికిఎరుక!?
ఏమడిగినా ఊ... ఆ ... అని తప్పఇంకేమొస్తాయ్ ఆనోటినుండి.
కాఫీ భలేవుందోయ్  అని అనడు. చుక్కకూడా లేకుండా వున్న కప్పు లోకి తొంగిచూసి మనమే  తెలుసుకోవాలన్నమాట.
నువ్వు కూడా పేపర్ చదువుకోవచ్చు కదా  ఎంచక్కా ... అని అనకండేం...మనం ఆ పని గంటముందే చేసేసాం. (ఇక్కడ 'మనం' అనగా  హీరో నాగార్జున కుటుంబం తీసిన 'మనం 'సినిమా కాదు. నేను..నేను అన్నమాట.)
సరే... పేపర్ లో తలదాచుకున్న శాల్తీ తో మనకేం పని!?  హాయిగా దివాన్ పై వెనక్కివాలి కూర్చోని ఫోన్ లో ఫేస్ బుక్ చదువుకుంటూ  మధ్యమధ్యలో వాట్సప్ మెసేజెస్ చూసుకుంటూ వుంటే...
ఇప్పుడు టిఫెనేంటి!?      దోశ
(ఇక్కడ ప్రశ్నలు అయ్యగారివి ...జవాబులు మనవి. అంటే నావి అని మళ్ళీ  చెప్పక్కర్లేదుగా.)
  దానికి చట్నీ ఏంటి?   కారం
వద్దు. పల్లీల పచ్చడి చేయి. మిక్సీ లో వద్దు.రోట్లో రుబ్బు.రుచిగా వుంటుంది.
వాట్సప్ లో  రోజూ గుడ్ మార్నింగ్ చెప్పే  ఫ్రండ్ పంపిన మెసేజెస్ లో మునిగిపోయివుంటాం కాబట్టి 'సరే 'అని చెప్పేస్తాం.  ఇక్కడా నేనే... నేనొక్కదాన్నే..
       ఇదేంటి బెడ్ రూమ్ లో దుప్పటి  మడవలేదు!
ఇల్లు  చిమ్మేప్పుడు అంతా విదిలించి అప్పుడు మడుస్తాను బాబూ.
బాల్కనీలో మొక్కలకు నీళ్ళు పోసినట్టులేదే.. వాడిపోయివున్నాయి.
కాస్తపోసి తడిపాను. తమరి పూజాకార్యక్రమాలు.సూర్య నమస్కారాలయ్యాక మళ్ళీ పోస్తాను.  కుండీల్లోంచి వచ్చిన నీటితో తడిచిన నేలకు  మీ పాదాలను పట్టి లాగి మిమ్మల్ని వాటేసుకోవాలని దానికి  మహా సరదా అని నాకు అసూయ... అందుకని మహాశయా...
"బాత్ రూమ్ లో మగ్గు లేదు..."    దానికి  కాళ్ళులేవు కాబట్టి అక్కడే వుంటుంది.మీకు కళ్ళున్నాయికదా బాగా చూడండి.
"నా షేవింగ్ క్రీమ్ తో నీకేం పని!? "నాకు దానితో పనిలేదు. దానిపని నిన్ననే అయిపోయి తమరి స్వహస్తాలతో అప్పుడే డస్ట్ బిన్ లో వేసేసారు. కొత్తది అల్మారాలో వుంది తీసుకోండి.
"టవల్లు ఉతికి చాలారోజులైనట్లుంది. చూడూ వాసనొస్తుంది."  అది టవలే.. కాని రిటర్మెంటయి ఈ మధ్యే  కొత్తగా వంటింట్లో గట్టు తుడిచే కార్యక్రమం చేపట్టింది. తమరు టవల్ కోసం చూడాల్సింది అల్మారాలో.బాల్కనీలో షింక్ దగ్గర కాదు. అక్కడున్నది గట్టుతుడిచి ,తడిచి, చలికి దడిచి  ఎండకోసం దండెంమీద ఎదురుచూస్తున్న పాత తువ్వాలు.
వంటింట్లో ధణేల్ మని చప్పుడు.... నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతుందన్న మూలుగు ఒకేసారి రావడం యాధృఛ్ఛికమైతే కాదుకదా!
ఒక్క నిముషం సమయంలో ఫోన్ ఛార్జింగ్ లో పెట్టేసి మనం  (ఇక్కడ కూడా నేను .... నేను మాత్రమే.)  ఒక్క ఉదుటున వంటింట్లో కివచ్చి చూస్తే ....
అక్కటా.... ఇచట నేను చూసినది ఏమనగా....
పొద్దున్నే  మా ఇల్లు దాటి వీధంతా పరిమళించే సువాసనలతో నా  సుకుమార,సుందర స్వహస్తాలతో తయారుచేసుకునే ఫర్క్యులేటర్ ను
తన మొరటు, గరుకు చేతులతో గట్టు మీంచి కిందపడేసి,అది ధణేల్మని అరిచి నేలంతా దొర్లి పొగిలి పొగిలి ఏడ్చుచుండగా...

దాన్ని ఓదార్చాలని దానిముందు కూర్చోనున్న మా శ్రీవారి ని  వెనకనుండి చూసిన నేను పెట్టిన కేక నా నోటి నుండి పాటలా....
"పొద్దున్నే పుట్టిందీ చందమామ ... లలలా .."
"దీనికేమైందో (ఇదీ నేనే ....మా ఆయన ముద్దుగా అలా నన్ను పిలిచే పిలుపులలో ఇదీ ఒకటి. మీరు మరీ అదోలా అయిపోకండేం...) తిట్టకుండా పాటపాడేస్తుందని ఆశ్చర్యచకితుడై నావంక అదోలా చూస్తూనే..."ఏంటి?" అని అయోమయంగా అడుగుతున్న తనతో 
ఇందాక మీరు అలా కూర్చోనున్న సమయంలో  మీ తలపై కనిపించిన చందమామని చూసి  అదేలెండి మీ బట్టతలని అలా అందమైన చందమామ తోపోల్చి....అది వెంకటేష్ ,విజయశాంతి హిట్ కాంబినేషన్ లో  వందరోజుల పండగచేసుకున్న కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన శతృవు సినిమాలో పాట అలా...అలవోకగా నా నోటివెంట వచ్చేసిందని ముసిముసి నవ్వులతో  చెబుతుంటే ....
వంటింట్లో  దిగులుగా  తనతలపైని చందమామని తడుముకుంటున్న  ఆయనగారిని చూస్తుంటే... మరోపాట నా నోటినుండి "మరల తెలుపనా ప్రియా... మరల తెలుపనా..."


      

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు