నేను నాన్న సిగరెట్

తన వాళ్ళందరి మధ్య తృప్తిగా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా వున్నారు నాన్న. మన అనుబంధం ముగిసిపోయింది తల్లీ! ఇది శాశ్వతనిద్ర అని చెబుతూంది ఆయన వదనం.
    "అమ్మలూ.. నీ ప్రయాణం రెండురోజులపాటూ వాయిదా వేసుకో", అని చెప్పింది యిందుకేనా... "నీకు ముందే తెలుసా నాన్నా... యిలా జరుగుతుందని...", నీరు నిండిన నా కళ్ళకు నాన్న సరిగా  కనబడడంలేదు.
  "పాడు సిగరెట్లు మానమంటే మానకపాయె వాడికన్నా పదేళ్ళు పెద్దదాన్ని. గుండ్రాయిలా వున్నాను. వీడేమో అప్పుడే వెళ్ళిపోయాడు. ఉద్యోగం చేసేప్పుడు ఒక్క నిముషమైనా విశ్రాంతిగా కూర్చొలేదు. పిల్లలకి కష్టం తెలీకుండా పెంచాడు. బాధ్యతలన్నీ పూర్తయ్యాయి. హాయిగా, విశ్రాంతిగా పిల్లలదగ్గర కొంతకాలమైనా వుండలేదే...". అమ్మని పట్టుకొని ఏడుస్తున్న అత్తయ్యను ఊరుకోమని ఎవరూ చెప్పడంలేదు. నాన్న తలదగ్గర వెలుగుతున్న అగరు వత్తుల పొగ ఘాటైన వాసనతో హాలంతా పరచుకుంటుంది.
      "సిగరెట్లు తాగడం మానేయమని మీరైనా గట్టిగా చెప్పలేకపోయార్రా", పెదనాన్న స్వరం సమాధానం కావాలని ఆగ్రహంగా అడగడంలేదు.   "మీ వల్ల కూడా కాలేదు కదా!", అన్న ఆవేదనని  మౌనంగా పంచుకోమంటూంది.
  ఏం చెప్పకుండా తమ్ముడు, చెల్లిలా కన్నీళ్ళతో తలవంచుకుని ఊరుకోలేకపోతున్నాను. అలాగని నేనేం సాధించానో  కూడా  చెప్పుకోలేను.   ఇలాఎందుకు  జరిగింది నాన్నా... అని  నాన్నని అడగాలనివుంది, సమాధానం రాదని తెలిసినాకూడా. ఆ మూసిన కనురెప్పల వెనుక నాకు కనబడకుండా దాగిన దృశ్యమేదో  చూడాలంటే ఎలా....!? పద నాన్నా...  నీ చేయి పట్టుకొని నీతో నడిచిన రోజులలోకి...   నీకెంతో యిష్టమైన నీ సిగరెట్టుతో పాటూ......
             నాకు నాలుగేళ్ళ వయసప్పటికి తమ్ముడు, చెల్లి, వంటింట్లో పనులతో అమ్మెప్పుడూ బిజీ. నాతో ఆడుకోలేని తమ్ముడు, చెల్లిని కనిపెట్టుకొనుండడం,  నిద్రపోతే ఊయలూపడం, లేచాక అమ్మకు చెప్పడం. ఇవన్నీ అమ్మకు నేను చేసే బుడతసాయం. సాయంత్రం గుమ్మం దగ్గరనిలబడి నాన్నకోసం ఎదురుచూడడం-గేటుదగ్గర నాన్నరావడంచూసి పరిగెత్తుకెళ్ళి వంటింట్లోవున్న అమ్మకు ఈ విషయం చెప్పడం యిదంతా అమ్మకు   నాకై నేనుగా చేసే సాయమనుకుంటే... నాన్నతో కలిసి సైకిల్ పై బజారుకు వెళ్ళి ఇంటికి కావలసిన సరుకులు పట్టుకురావడమన్నది, అమ్మకు  నేనుచేసే సాయానికి నాన్న నా కిచ్చే తాయిలం అన్నమాట.                                                                                                                                యిలా సైకిల్ పై మా సవారీ లో కొంచెం దూరం వచ్చాక చూస్తే నాకు ఒక కాలికి చెప్పువుండదు. "నాన్నా నా కాలి చెప్పు ఎక్కడో పడిపోయింది", అంటే నాన్న సైకిల్ వెనక్కి తిప్పి తిరిగి వచ్చినదారినే వెళ్ళి రోడ్డుపై పడివున్న చెప్పును తీసుకొని కొంచెందూరం వచ్చాక మళ్ళీ  నా చెప్పు కనబడకపోవడం- నేను నాన్నకు చెప్పడం- యింటికి వచ్చేలోపల యిలా రెండు- మూడుసార్లయినా జరుగుతుంది. ఇంటికొచ్చాక  అమ్మ, "ఏంటి యింత ఆలస్యమైంది", అంటే నాన్న సమాధానమేమీ చెప్పకుండా సిగరెట్ వెలిగించుకొని వరండాలో కూర్చోని వీధిలో వెళ్ళేవాళ్ళని చూస్తూ వుంటారు. అలా  సిగరెట్ తాగుతున్న నాన్నని చూస్తే అమ్మకు కోపం.
ఒకపక్క నాన్న వరండాలో కూర్చోని నిశ్శబ్దంగా ఒకదాని తరువాత ఒకటి వరుసగా సిగరెట్లు తాగేస్తూ వుంటారా.... అమ్మేమో నాన్నను   తాగొద్దని నేరుగా చెప్పలేక, వంటింట్లో గిన్నెల్ని  ధనేల్- ధనేల్ మని చప్పుడయ్యెలా పడేస్తూ తన మనసులోని మాట నాన్నకు వినిపిస్తూంటూంది. ఆ వయసులో నాకు వంటింట్లో కోపంగా రుసరుసలాడుతున్న అమ్మకన్నా వరండాలో రింగులు రింగులు గా పొగను వదులుతూ సిగరెట్ కాలుస్తున్న నాన్నే నచ్చేవారు. నాన్న కోపంగా వుండడం నేనెప్పుడూ చూడలేదు. అందుకనే అమ్మను, "ఎందుకు నాన్నను కోప్పడుతావు?", అని అడిగేదాన్ని. అమ్మ ఏం సమాధానం చెప్పేది కాదు. చెప్పినా అర్ధం చేసుకునే వయసు కాదుగా నాది.
  స్కూలుకు వెళ్ళిన కొన్ని సంవత్సరాలకు సిగరెట్ తాగడం వలన ఆరోగ్యం పాడవుతుందని తెలిసింది. అమ్మకోపానికి అర్ధంవుందని తెలిసింది. నాన్నతో వున్న చనువుకొద్దీ "సిగరెట్ తాగడం మానేయచ్చు కదా నాన్నా", అని మొదటిసారి నాకు పదేళ్ళ వయసప్పుడు అడిగాను. నాన్న తన వేళ్ళ మధ్య వెలుగుతున్న సిగరెట్ ను అలాగే చూస్తుండిపోయారు. నాకు సమాధానం ఏమీ చెప్పలేదు.
ఆ తరువాత నెమ్మదిగా నేను గమనించిందేమిటంటే... నాన్న మాముందు సిగరెట్ తాగుతూ కనిపించడం తగ్గిపోయింది. వారంలో  ఆరురోజులు నాన్నకేమో ఆఫీసు తో, మాకేమో స్కూలు, ట్యూషన్లతో తీరికలేకుండా గడిచిపోయేది. ఒక్క ఆదివారం రోజే అందరం కలిసి గడపడానికి వీలయ్యేది. ఆ ఒక్కరోజు లోనే వారంరోజుల తనప్రేమనంతా భర్తీచేస్తేనే నాన్నకు తృప్తి. ఆ భుక్తాయాసం నుండి మేము   తేరుకునేసరికి మరో ఆదివారం మా ఎదురుగ  నవ్వుతూ నిలబడివుండేది. 
     
      నాన్నదగ్గర  నేర్చుకునే పాఠాలు కూడా భలేవుంటాయి. ముఖ్యంగా నాన్న చెప్పే లెక్కలు ఎలావుంటాయంటే...పండ్లు,కూరగాయలు?  గంపల్లో తెచ్చి ఇంటి దగ్గర అమ్ముకునేవాళ్ళు    వచ్చినప్పుడు నాన్న యింట్లో వున్నారంటే  వారికి పండగే. పండ్లు, కూరలు వాళ్ళు చెప్పిన ధరకు  ఏమాత్రం బేరం చేయకుండా డజన్లకుడజన్లు సమృధ్ధిగా కొనేస్తారు. వాళ్ళలో ఎవరైనా బొట్టులేని ఆడవారు వున్నారంటే నాన్న మరింత దయామయులై పోతారు. ఆ సమయంలో ఇంట్లో అమ్మమ్మ వంటి పెద్దవారుంటే నాన్నను ఏమీ అనలేక "యిలాగేనా సంసారం నడిపేది", అని అమ్మను బాగా చీవాట్లు పెడతారు. ఇది చూస్తూ ఊరుకోలేక నేను నాన్నతో "మీరు వాళ్ళకు ఎక్కువ డబ్బులు ఎందుకివ్వాలి?", అనడిగితే నాన్న "ఒక్క రూపాయే కదరా!" అని నవ్వి ఊరుకుంటారు. అమ్మమ్మ యేమో "ఈరోజు ఒక్కరూపాయే యిలా రోజూ ఒకరూపాయి పక్కనపెడితే అవే వందలు, వేలు అవుతాయి. ఆడపిల్లలున్నారు. పొదుపుచేయాలి కదా!", అని మాతో చెప్పేది. అదీ నిజమే మా ఫ్రండ్స్ కంతా సొంతయిల్లు, ఆస్తులు వున్నాయి, మాకు అవేమీ లేవు. ఈ మాటే నాన్నతో అంటే "పగలంతా నెత్తిన అంత బరువు మోస్తూ వీధులన్నీ తిరిగి కష్టపడి అమ్ముకుంటే ఆ తల్లికి  వచ్చే లాభం కొంచెమే. ఆ కొద్ది డబ్బులతోనే యింట్లో పిల్లలకు భోజనం పెట్టాలి. మనం అదనంగా యిచ్చే ఈ రూపాయి తో పిల్లలకు ఏ పండో, మిఠాయో తీసుకెళుతుంది. అవి తింటూవుంటే ఆ పిల్లల ఆనందం- అది చూసి ఆ తల్లి కళ్ళలో కనిపించే వెలుగుకు విలువ ఎంతని లెక్కగట్టగలం తల్లీ మనం. అలా మిగలబెట్టిన డబ్బును దాచుకొని కట్టే యిల్లు మనకొద్దమ్మా". యిలా చెప్పే నాన్నను   చూసి "ఒట్టి సత్తెకాలపు మనిషి", అని మురిపెంగా విసుక్కునేది అమ్మమ్మ. అదిచూసి పకపకా నవ్వే అమ్మంటే నాన్నకు ఎంతో యిష్టం. వాళ్ళందరినీ అలాచూస్తుంటే మాకు తిరునాళ్ళలో ఏనుగెక్కినంత సంబరం.
        పదవ తరగతి పరీక్షలు, ఆ తరువాత రిజల్ట్స్, తిరిగి కాలేజ్ లో చేరేలోపల చాలా రోజులుయింట్లో  ఖాళీగా వుండడంతో మరల చిన్నప్పటికి మళ్ళే నాన్నతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికింది. తన చిన్ననాటి కబుర్లు, నా చిన్నప్పటి ముచ్చట్లు అన్నీ చెప్పేవారు నాన్న. ఆ టైంలో  మరలా నాన్నతో బాగా చనువు పెరిగింది. ఒకరోజు సిగరెట్ తాగుతున్న నాన్నతో "దేనికి నాన్నా సిగరెట్లు తాగడం మానేయచ్చుకదా!" కొంచెం కోపం గానే అడిగాను. ఎందుకంటే నాన్న సిగరెట్ తాగడం అమ్మకు నచ్చదు. వద్దు అంటే నాన్న పట్టించుకోరు. అది తప్ప మిగిలిన అన్ని విషయాలలో నాన్న అమ్మమాటని మన్నిస్తారు. ఆరోగ్యం పాడవుతుందని అమ్మకు బాధ. కోపం ఎక్కువయినప్పుడు వంటింట్లో అమ్మ అలక-వరండాలో మౌనంగా నాన్న. ఇద్దరి మధ్య వారధిలా  సంధిప్రయత్నాలు చేస్తూ నేను. ఇటువంటి సంధర్భంలోనే నాన్నని అడిగాను.
"మీ అమ్మకన్నా ముందు నుంచీ నాకు తోడుగా వుంది యిది. ఒంటరితనంలో నాకు ఆనందాన్నిచ్చే నేస్తం తల్లీ యిది." అన్నారు.
"ఇప్పుడు మీకు మేమంతా వున్నాంకదా నాన్నా!  యింకెందుకు ఈ సిగరెట్? అంటే పాపం అప్పుడు యిది ఒంటరదయిపోతుంది కదరా... అందుకే  వదలలేకున్నా", అన్నారు నవ్వుతూ.
"సంతోషాన్ని పంచుకున్నంత తేలికగా బాధను  అందరితో పంచుకోలేను తల్లీ ఆ సమయంలో యిది మాత్రమే నాకు రిలీఫ్ నిస్తుంది. తన చేతిలో సిగరెట్ వంకే చూసుకుంటూ అన్నారు నాన్న.
      "కాని సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది కదా నాన్నా!" అన్నాను.
"యిదే లేకపోతే యింకా తొందరగా చనిపోతానేమో!"  వణుకుతున్న స్వరంతో తనలో తాను నెమ్మదిగా పలికిన ఆమాటలు బలంగా నాహృదయంలోకి చొచ్చుకుపోయాయి.  మరెప్పుడూ ఆయన ముందు సిగరెట్ ప్రస్తావన తీసుకురావాలనిపించలేదు. సున్నితమైన ఆయన మనసును మరింత గా బాధపెట్టాలనిపించలేదు
ఆయన బలం తన కుటుంబం. బలహీనత సిగరెట్. రెండూ తనకి కావాలి. తన బలహీనతపై ఎప్పుడూ పైచేయిగా బలమే వుండాలనుకునేలా మెలిగితే నెమ్మదిగా తన వేళ్ళమధ్య వెలుగుతున్న సిగరెట్ మాయమవుతుందని మా ఆశ. ఎప్పుడైనా వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటున్న నాన్న తనగదిలో వున్న సిగరెట్, అగ్గిపెట్టె తీసుకురమ్మని చెబితే నేను తప్ప ఆ పని ఇంట్లో  ఎవ్వరూ చేయరు. సిగరెట్ పై వారి నిరశన అలా ప్రదర్శిస్తారు. నాన్న సిగరెట్ వెలిగించాక ఏదో ఒక విషయం గురించి ఆయనతో చర్చిస్తాను. నాకు అర్ధమయ్యెలా వివరంగా చెప్తూవుంటే  తన వేళ్ళమధ్యన వున్న సిగరెట్ అక్కడే కాలి నుసి  అయిపోతుంది. ఆఫీస్ కు టైం అవడంతో... పాపం నాన్న మరో సిగరెట్ వెలిగించరు. అలకలే కాదు. అప్పుడప్పుడు ఇలాంటి సరదాలు కూడా ఇస్తుందీ  సిగరెట్.                 
    అంతాబాగున్నప్పుడు కళ్ళుమూసి తెరిచేలోగా  మనలోకం మారిపోతుంది. ఒకవైపు మా చదువులు పూర్తవడం, ఆపైన పెళ్ళి పిల్లలు, మా కుటుంబం. మరోవైపు నాన్నకూడా ఉద్యోగబాధ్యతలు పూర్తయి సొంతఊర్లో అమ్మ తో కలిసి హాయిగా వుంటున్నారు. రెండ్రోజులకోసారి ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. "ఎలా వున్నారు నాన్నా", అంటే "నాకేం తల్లీ హ్యాపి", అని హ్యాపిగా చెప్పేస్తారు. కాని అమ్మతో మాట్లాడితే తెలుస్తుంది అసలు సంగతి. ఈ మధ్య నాన్న ఆరోగ్యం బాగలేదని అమ్మ బాధపడుతూంది. నాలుగురోజుల్లో పిల్లల పరీక్షలు మొదలవుతాయి. అవయ్యాక సెలవలు అప్పుడు పిల్లలతో అమ్మనాన్నదగ్గరకి వెళ్దామని ముందుగా  అనుకున్నాము. కాని, ఫోన్ లో అమ్మ తో మాట్లాడిన తర్వాత వెంటనే నాన్నని చూడాలనిపించింది.
 
       చెప్పా పెట్టకుండా వచ్చేసిన నన్ను చూడగానే  నాన్న ఆశ్చర్యపోయారు. "ఏం తల్లీ... పిల్లలూ, రాఘవ, క్షేమమే కదా! అక్కడ ఇబ్బందేమీ లేదుకదా!" తనగురించి ఆలోచించుకోరు గాని అందరి యోగక్షేమాలూ ఆయనవే. "మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేసాను". అనగానే ఎంత సంబరపడిపోయారో...
                నేనొచ్చి రెండురోజులయ్యింది. రోజులింత త్వరగా గడిచిపోవడం ఈ మధ్యకాలంలో జరగలేదు. మా ముగ్గురిలో ఎవరు పెద్దో? ఎవరు చిన్నో తెలియడంలేదు. వాళ్ళిద్దరూ ఇరవైయేళ్ళు వెనక్కివెళ్ళిపోయారు. నన్నో పసిపాప లా చూసుకుంటున్నారు. నా కళ్ళకి వాళ్ళిద్దరూ నా కడుపున పుట్టిన పిల్లల్లా కనబడుతున్నారు.
                   నాన్న మంచిమూడ్ లో వున్నప్పుడే "అమ్మకు హెల్త్ చెకప్ చేయిద్దాం నాన్నా", అంటే సరే పదమన్నారు. ఫామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాము. డాక్టరుగారు నాన్న సిగరెట్లు తాగడం మానేయాలని హెచ్చరించారు.
       

హాస్పిటల్ నుండి వచ్చినప్పటినుండి నాన్నతో ఎలా మాట్లాడాలా... అని తీవ్రంగా ఆలోచిస్తున్నా. రాత్రి భోజనాలయ్యాక బెడ్ రూం బాల్కనీ వద్ద కుర్చీలో కూర్చోని సిగరెట్ తాగుతున్నారు నాన్న. దగ్గరకు వెళ్ళి కూర్చున్నా, "నీ చేతిలో వున్న సిగరెట్ ను చూస్తుంటే ఈర్ష్యగా వుంది నాన్నా", అన్నా.
"ఏం తల్లీ... నువ్వు కూడా అమ్మ పార్టీలో చేరిపోయావా" అన్నారు నవ్వుతూ.
"అదేం లేదు నాన్నా నేను ఎప్పటికీ నీ పార్టీనే. నీ పిల్లలందరం మా సంసారాలతో నీకు దూరంగా వుంటున్నాం. నీ నేస్తం మాత్రం నిన్నంటిపెట్టుకునేవుంది.... యిప్పటికీ..." నా గొంతులో కోపం, ఆవేదన కలగలిసిపోయింది.
"లేదు లేరా... బాగా తగ్గించేసాను. రోజుకు రెండో మూడో అంతే. నీకో తమాషా చెప్పనా... ఈ సిగరెట్ అలవాటయిన కొత్తలో రోజుకు రెండో మూడో లెక్కగా తాగేవాడ్ని. ఎందుకంటే అప్పుడు   అంతకన్నా ఎక్కువ తాగాలంటే చేతిలో డబ్బులుండేవి కావు. యిప్పుడేమో శరీరం తట్టుకోలేక పోతుంది అంతే తేడా", నాన్న నవ్వుతూ అన్నారు.
"శరీరాన్ని అంతగా కష్టపెడుతున్నా, దాన్ని వదలలేక పోతున్నారు మీరు". నిష్టూరంగా అన్నాను.
"నా ఆరోగ్యం గురించి భయపడుతున్నావా!" అన్నారు.
"అవును. వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను. మీరు బాగా ఆయాసపడుతున్నారు. రాత్రిళ్ళు శ్వాస తీసుకోవడం కష్టంగా వుంది. నాకు ఊహ తెలిసినప్పటినుండి అడుగుతున్నాను. సిగరెట్లు మానేయమని. ఈ విషయంలో ఒక్కసారి కూడా నా మాట వినలేదు. అమ్మమాట ఎలాగూ వినిపించుకోరు. కనీసం మా కోసమయినా... యిప్పుడు మీకు టెన్షన్స్, బాధ్యతలు యివేమీ లేవుకదా! ప్లీజ్ నాన్నా..."
నాన్న సమాధానం యేమీ చెప్పలేదు. ఆయన మౌనంగా వున్నారంటే నేను చెప్పేది తనకు నచ్చడం లేదు. నాన్న మాపై కోపం చేసుకోరు. నేను నాన్న మనసు బాధపెట్టినట్లు అర్ధమైంది. యింకేం మాట్లాడకుండా గుడ్ నైట్ చెప్పి వచ్చేసాను.
"అమ్మలూ... రెండ్రోజులాగి వెళ్ళకూడదామ్మా..!" ఊరికి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకుంటున్న నాతో నాన్న అన్న మాటలకు ఆశ్చర్యం వేసింది. నాన్న ఎప్పుడూ యిలా అడగలేదు. ఈ రోజు ఎందుకు యిలా!? నాకేం సమాధానం చెప్పాలో తెలియలేదు. అమ్మనుండి ఫోన్ వచ్చిన వెంటనే వచ్చేసాను. వచ్చి రెండురోజులయిపోయింది. రెండురోజుల్లో పిల్లలకు పరీక్షలు మొదలవుతాయి. వెళ్ళకతప్పదు. కాని, ఎక్కడో మనసుమూలల్లో ఓ ఆశ తళుక్కుమంది. నాన్న సిగరెట్ తాగడం మానేస్తానంటారేమో... సరే నాన్నా", అని తలవూపేసా కాని, నేను మాత్రంనాన్నతో  సిగరెట్ గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా.
      నాన్న ఆ రోజంతా ఉల్లాసంగా వున్నారు. తమ్ముడు, చెల్లితో ఫోన్ లో మాట్లాడారు. రాత్రి నిద్రపోయేముందు "రేపు గుడికి వెళ్దాం తల్లీ", అని చెప్పారు.
      గుడిలో దైవ దర్శనం చేసుకొని మండపం దగ్గర కూర్చున్నాం." ఈ ప్రదేశానికి మనకు ఓ విశేషం వుందిరా" అన్నారు.
"నువ్వు మూడునెలలపాపగా వున్నప్పుడు అమ్మ, నేను మొదటిసారి నిన్ను తీసుకోని ఈ గుడికే వచ్చి, యిదిగో... యిక్కడే కూర్చున్నాం. ముద్దుగా బొద్దుగా వుండేదానివి. తొలి సంతానంవి. ఎంతకష్టమైనా భరిస్తాను కాని నా బిడ్డ ఎప్పుడూ ఎలాంటి బాధ లేకుండాసంతోషంగా  పెరగాలి. అని యిక్కడే ఈ దైవ సన్నిధిలోనే మనసులో నిర్ణయించుకున్నా. భగవంతుని దయ వలన అంతా నేననుకున్నట్లే జరిగింది. యింకేం కావాలనిపించడం లేదుతల్లీ..." అన్నారు.
"మీ బాధ్యత పూర్తయ్యింది. మరి మాకూ మిమ్మల్ని బాగా చూసుకోవాలని వుంటుంది కదా!" అన్నాను.
ఈ జన్మలోనే ఋణం తీర్చేసుకుంటావా  వద్దులేరా... నవ్వుతూ అన్నారు నాన్న.
"అంత పెద్దమాటలెందుకులే నాన్నా..." నేనూ నవ్వేసాను. యిద్దరం తేలికపడ్డ మనసులతో గుడి వెలుపలకు వచ్చాం.
ఆటోలో గుడినుండి యింటికి వెళుతుంటే దారిలో వంతెన దగ్గర తన జేబులో నుండి సిగరెట్ పాకెట్, లైటర్ తీసి దూరంగా నదివైపు విసిరేసారు. ఆశ్చర్యంగా చూస్తున్న నాతో "చూద్దాం రేపు ఉదయం వరకు తాగకుండా వుంటాను కదా!" నవ్వుతూ అంటున్నా విషయాన్ని ఆయన సీరియస్ గా తీసుకుంటున్నట్లుగా నా కనిపించింది.
ఇంటికి వచ్చాక కూడా నాన్న హుషారుగానే వున్నారు. ఏదో పొగొట్టుకున్నానన్న ఫీలింగ్ ఆయనలో కనిపించలేదు. రాత్రి భోంచేసాక కాసేపు అమ్మతో, నాతో కబుర్లు చెప్పారు". యింకపడుకో తల్లీ... ఉదయాన్నే ఊరెళ్ళాలి కదా అనిచెప్పి పడుకున్నారు.
  కాలచక్రం తిరుగుతునే వుంటుంది. చంద్రునికి సెలవిచ్చి సూర్యుడు పగ్గాలు పుచ్చుకున్నాడు. రాత్రి నిదురపోయిన నాన్న మాత్రం మరి లేవలేదు.
    హాల్లో టేబుల్ పై నాన్న పటం పెట్టి ఎప్పుడూ ఆయనదగ్గర వుండే కళ్ళజొడు, వాచి పెట్టాడు తమ్ము డు. సిగరెట్ పెట్టె కూడా వుంచండి అన్నారెవరో.
"అక్కర్లేదు. నాన్న సిగరెట్ తాగడం మానేసారు". అమ్మ దగ్గరగా వెళ్ళి చెప్పాను. "నాన్న మంచితనానికి సిగరెట్ నుసి అంటుకోలేదు".

      
    

 

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు