'మల్లేశం' సినిమా కు అభినందనతో


ఓరోజు ఫ్రండ్ వాళ్ళింటిలో ఒకపెద్దావిడ...చనువుగా వంటింట్లోకిపోబోతున్న  నన్ను ఆగమని, పరిశీలనగాచూసి పక్కనేవున్న మా ఫ్రండ్ అమ్మతో "ఈపిల్ల చూడ్డానికి మనవాళ్ళలాగేవుంది. అయినా ఓసారిఅడిగిచూస్తా "అని  "మీరేమట్లే... " అని అడిగింది.
ఆవిడఏమడిగారో అర్ధం కాక  క్వశ్చిన్ మార్క్ మొహంతో నిలబడిన నాతో ఆవిడ సంభాషణ
"నీ  పేరేంటే?"
"వాసవి మామ్మా "
" కన్యకాపరమేశ్వరి అమ్మవారిపేరు...అర్ధమైందిలే   మీకు ఏ షాపు వుంది
"మాకు షాపులేమీలేవు ."
"అవునా ... సరే...మీ నాన్నఏంచేస్తారు?"
"ఆఫీస్ కి వెళుతారు"
"మీ నాన్నపేరేంటే ?
"మునిరాజ "మామ్మా."
"మీరుండేది రాజుగారి ఇంటిపక్కనేకదా..."
"అవునుమామ్మా..,"
"అదన్నమాటసంగతి.
సరే .బయటకెళ్ళిఆడుకోండి. మడికట్టుకోనుంటాంకదా ఇక్కడికి రాకూడదు."వంటింట్లోకి ఎంట్రీ  ఇవ్వకుండా పంపేసారు.
ఆవిడకు ఏమర్ధమైందో  ...ఆవిషయం అప్పుడు  నాకేంఅర్ధంకాలేదు గాని అప్పటినుండి ఫ్రండ్స్ అందరం పెద్దవాళ్ళదగ్గర కాస్త జాగ్రత్తగా వుండేవాళ్ళంఅంతే.
ఎండాకాలం సెలవలకు  అమ్మమ్మవాళ్ళూరు శ్రీకాళహస్తికివెళ్ళాం. రోజంతా ఆటలు, షికార్లు. మధ్యాహ్నాలు మాత్రం ఎండఅని  ఇంట్లోనే వుండాలి.
అందరిభోజనాలూఅయ్యాక అమ్మమ్మ,అత్తమ్మ,  వంటింట్లోనే గోడవారగావున్న రాట్నాలని ముందుకు తెస్తారు.ఒకచేత్తో రాట్నం తిప్పుతూ నూలు 'చిలప' నుండి దారం  వేళ్ళమధ్యనుండిరానిస్తూ  డబ్బాకిచుట్టుతుంటారు.వేళ్ళమధ్యన దారం సర్ర్ మనివేగంగా వస్తూంటూంది.  ఎక్కడవేలు తెగుతుందోనని భయమేస్తుంటుంది అది చూస్తుంటే. ఇంక మా పెద్దమ్మ అయితేఈపనిచేస్తూనే ఎదురుగావీక్లీ  పెట్టుకొని చదివేస్తుంటుంది. మధ్యాహ్నం కాసేపన్నా పడుకోకుండా ఇలా నూలు తిప్పి  ఎంతోకొంత డబ్బు వస్తే అది వారిచేతిఖర్చులకు వాడుకుంటుంటారు. మమ్నల్ని సినిమాలకుతీసుకెళుతారు కాబట్టి ఇక్కడమాత్రం వీళ్ళకిసాయంచేయడానికి మేమేముందుంటాం.ఈనూలుడబ్బాలను అమ్మమ్మవాళ్ళింటివెనకవున్నసాలిపేటకు తీసుకెళ్ళేప్పుడు  దారిపొడుగునా ప్రతిఇంటిముందు రాట్నాలు,లోపల మగ్గంనేస్తున్నచప్పుడు వినిపిస్తుంటూంది. కొందరిండ్లలో వెనకవైపు ఒకపెద్దషెడ్ వుంటుంది లోపలపెద్దగుంట అక్కడఒకపెద్దసైజు రాట్నం వుంటుంది.దీన్ని ఆసు రాట్నం అంటారట.ఒకపక్కననిలబడిచేత్తో దాన్నితిప్పుతూ  నూలుడబ్బాలలోనినూలునంతా ఆ రాట్నానికిఓసారిక్లాక్ వైజ్ ,మరోసారియాంటీక్లాక్ వైజ్ గా  చుట్టుతారు. మగ్గంపై చీరనేయడానికి  దారంపోగులన్నీ ఇలా సెట్ చేసుకుంటారు. ఈపనులు ఎక్కువగా ఆడవారే చేస్తుంటారు. భుజాలు,చేతులకు ఎంతశ్రమో....
ఇదంతా ఆశ్చర్యంగా వింతగా చూస్తున్ననాతో  అక్కడున్న ఒక పెద్దావిడ "ఏమే...సాలోల్ల పిల్లవే కదటేనువ్వూ ...ఇంతవింతగా చూస్తున్నావేంది?"అని అడిగింది.
అర్ధంకాక అయోమయంగా చూసా.
పనిలోపడినపెద్దావిడ మరేం మాట్లాడలేదు.దారిలోఅమ్మమ్మ నడిగితే
..మేము చేనేతపనిచేసే పద్మశాలీయులమని తెలిసింది.
పేదరికం,కడుపునిండా తిండిలేక బక్కచిక్కినశరీరాలు, రోజంతా కష్టపడినా ఎదుగూబొదుగూలేని జీవితం,అప్పులు,  నిరాశతో కొంతమంది వ్యసనాలబారినపడి మరింత దిగజారిపోయిన బ్రతుకులు.అప్పులబాధ భరించలేక ఆత్మహత్యలు. ఆత్మన్యూనత, చేయిచాచిసాయంఅడగాలంటే సంకోచం,భయం. మావాళ్ళజీవితాలు చాలావరకూ ఇలాగేవుండేది.  పరిస్ధితులకు భయపడి పారిపోయిన మొగుళ్ళు,వ్యసనాలబారినపడి ఇల్లు ,ఒళ్ళుపాడుచేసి ఉరేసుకున్నతండ్రులు, ఇలా ఎంతమందినిచూసానో...
కానిఅదేచోట భర్త పారిపోయినా,ఉరేసుకొని చనిపోయినా ..ఎవరికీభారమవకుండా .ఒంటిచేత్తో  నేతపని చేస్తూనే పిల్లల్ని,పెంచి పెద్దచేసినఅమ్మలను చూసాను. అమ్మకు తోడుగా పనిలోసాయం తోపాటూ ఆకలిని పంచుకున్నఆడపిల్లలు, అమ్మకష్టం  చూడలేక ఒకపక్కచదువుకుంటూనే మగ్గంనేసుకుంటూ బాధ్యతలు అందుకున్నమగపిల్లలు. కష్టపడిచదువుకొని స్ధిరపడ్డాక అమ్మను మాత్రమే కాక తనవాళ్ళందరికీసాయంచేస్తున్న వారిని.
ఇలా ఎంతమందినో.
ఈరోజు  'మల్లేశం' సినిమా గురించి చదువుతుంటే..ఇదంతా చెప్పాలనిపించింది. అమ్మ కష్టం చూడలేక శ్రమలేకుండాసులభంగా పనిజరిగేలా ఆసు యంత్రం తయారుచేసిన కొడుకు 'చింతకిందిమల్లేశం'గారి నిజజీవితకథని సినిమారూపంలో మనముందుకు తీసుకువచ్చిన వెంకటసిధ్ధారెడ్డిగారికి ,చిత్రంయూనిట్ కు అభినందనలు.

    

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు