మాకూ ఓరోజుందోచ్చ్

ఏంటి ఈరోజు విశేషం.. మనపండగకదా!  అదేలే దినాలూ,రోజులూ అనేకన్నా పండగ అనుకుంటే ప్రత్యేకంగావుంటుందికదాని...
అవునూ ...పండగ అందులోనూ మనఆడవాళ్ళందరి పండగ ఎలా జరుపుకోవాలబ్బా!?
మామూలుగా అయితే పండగకి నాలుగురోజులముందే సెలబ్రేషన్స్ మొదలైపోతాయికదా! బూజులు దులపడాలూ, అటకలు సర్దడాలూ, చెత్త,చెదారం బయటపడేయడాలూ వగైరా వగైరా...
కొత్తబట్టలకోసం గంటలతరబడి షాపింగులూ,టైలర్ దగ్గరఇచ్చిన జాకెట్లు  పేచీలేకుండా ముందురోజే ఇచ్చేయాలని కత్తెర సాక్షిగా చేసుకున్న ఒప్పందాలు.
ఇంకా.... ముందుగా చేసుకోవలసిన అప్పచ్చులకు సరకులు తెచ్చుకోవడం, బాగుచేసుకోవడాలూ, పిండి కొట్టుకోడాలూ, అమ్మో...పండగరోజు మండిపోయేధరలని  రెండురోజులముందే
పూలూ,పండ్లూ తెచ్చి ప్రిజ్ లో కుక్కడాలూ..
  పండగరోజంతా వంటింట్లో,పూజగదిలో  బిజీఅయిపోయి  వండినవన్నీ పొట్టనిండా తిని, ఓ కునుకుతీసి , సాయంకాలం పేరంటానికి  సిధ్ధం  అయి వాయినాలు,పిండివంటలూ ఇచ్చిపుచ్చుకొని
మనచీరకన్నా పక్కచీర బాగుంటే చాటున కుళ్ళుకొని  ....మధ్యాహ్నం మిగిలిన వంటకాలను రాత్రికి  ఖాళీచేసేసి... గందరగోళంగా వున్న వంటింటిని ఒంటరిగా వదిలి , కట్టుకోనున్నకొత్తచీర తీసి పాతనైటీ తగిలించుకొని  పడుకొని నిద్రపోవడంతో హమ్మయ్యపండగ పూర్తయినట్టు. మరి  ఈ పండగనెలా జరుపుకోవాలబ్బా..
అందులోనూ  ప్రపంచంలోని ఆడవాళ్ళందరికీ పండగే. కనీసం పదిరోజులముందునుండయినా సంబరాలు స్టార్ట్ చేసుకోవద్దా...
రెండురోజులముందొచ్చిన పండక్కి నలుగుపెట్టుకొని తలంటిస్నానంచేసిన ఇల్లు కొత్తపెళ్ళికూతురిలా కళకళలాడుతూంది.కాబట్టి శుభ్రంచేసే పనిలేదు. ప్రత్యేకంగా పూజలూ,వ్రతాలు వుండవుకాబట్టి నైవేద్యాలు చేసేపనికూడాలేదు.
మరి ఈ పండగ ఎలాజరుపుకోవాలో... ఏంటో...
"ఏమండోయ్ .... ఈరోజు మా మహిళల దినోత్సవం. ఎలా సెలబ్రేట్ చేసుకోనూ..."
ఈ ఒక్కరోజేం ఖర్మ ... అన్నిరోజులూ మీవేకదోయ్...
మధ్యాహ్నం భోజనంలోకి నాకిష్టమైన బటర్ చికెన్ , మినపగారెలూ చేయి. తినిపెడతా.
  అదేంటండీ ఈరోజు మా పండగ కదా! ఈరోజుకూడా వంటనేనేచేయాలా! 
మీ  పండగరోజు నీ స్వహస్తాలతో చేసిన వంటతినే భాగ్యం మాకివ్వకపోతే ఎలాగోయ్ ...
నిజమేనండోయ్ ... అలాగేచేస్తా.క్యారట్ హల్వా కూడా చేస్తాగా...





 

  

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు