మనపిల్లలే కదా!

వినాయక చవితి ముందురోజు నేను,మావారు కాణిపాకంవెళ్ళాం.గుడి ఆవరణలో  అడుగుపెట్టినప్పటినుండి దైవదర్శనం అయ్యేలోపు  ఎంతమంది నూతన  వధూవరులని చూసానో. కొత్తపెళ్ళికూతురుని చూడడమంటే  ఎంతబాగుంటుందోకదా! వాళ్ళతో వచ్చిన పెద్దలు  వారిని దగ్గరుండి దైవదర్ళనం చేయించి తీసుకెళుతుంటే వారినిచూసి ముచ్చటపడుతూ 'చల్లగావుండండర్రా' అని మనసులో అనుకున్నా. వాళ్ళెవరో నాకు తెలీదు.  అయితేనేం.. కొత్తగా పెళ్ళిచేసుకున్న జంట చూడచక్కగా వున్నారు. ఆశీర్వదించాలనిపించింది.
                 మనకళ్ళముందు మనచేతుల్లో  పెరిగిన పిల్లలు మంచిచెడూ తెలుసుకొని మంచిగావుంటేచాలనుకుంటాం.   వాళ్ళు మనకెప్పటికీ పసివాళ్ళే..         బుడిబుడిఅడుగులేసేవయసులో మనచేయి వదిలి అడుగేయబోయి పడబోతే అయ్యోనాన్నా... అని పట్టుకుంటాం. మనచేయిపట్టుకునే ఈ ప్రపంచంచూస్తారు. ఇంతింత కళ్ళతో  చూసిన ప్రతిదాని గురించి ప్రశ్నలే. కొన్నిటికి మురిసిపోతాం.ఇంకొన్నిటికి కసురుకుంటాం.వాళ్ళూరుకుంటారా...ఎలాగోలా  తెలుసుకోవాలనుకుంటారు.  ఈ ప్రయత్నంలోవారిచుట్టూ వారి కంటూ ఓ ప్రపంచం.ఇవన్నీకూడా  మనతో పంచుకోవాలన్న ఆరాటం ...తన స్నేహితులగురించి  కబుర్లుచెబితే సంతోషంగావింటాం.అందరికన్నా ముందుంటే  మెచ్చుకుంటాం. మనవాళ్ళందరికీ చెప్పి పొంగిపోతాం. వెనకబడితే ఫర్లేదులే  కొంచెం ప్రయత్నంచేయమంటూ ప్రోత్సహిస్తాం. మొత్తానికి వారిప్రపంచం చుట్టూ కంచెలా కాపలాకాస్తూ ఓ కంటఅన్నీ గమనిస్తూనేవుంటాం. కదులుతున్న కాలం తో పాటూ జరుగుతున్న ఎన్నింటికో ఒకసారి మనం ప్రేక్షకులం.  మరోసారి శ్రోతలం.   మనచేతుల్లో పెరిగిన పిల్లలు ఇప్పుడు పెద్దయిపోయామంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలమనుకున్నారు.వాళ్ళకు నచ్చినవారిని యెంచుకున్నారు.ప్రేమించుకున్నారు. పెళ్ళిచేయమన్నారు. మనవాళ్ళుకాదు అని కళ్ళెర్రజేసారు పెద్దోళ్ళు. మన అనుకున్నాక మనవాళ్ళేకదా!  ఇదికూడా తెలీదా ఈ పెద్దోల్లకని నవ్వుకున్నారు పిల్లలు.   నచ్చచెప్తే తెలుసుకుంటారనుకున్నారు. చిన్నతనంనుంచీ యిలాగేకదా చేస్తున్నాం...  ఫరవాలేదనుకున్నారు.స్నేహితులసాయంతో పెళ్ళిచేసేసుకున్నారు. హాయిగావున్నారు. ఆదరించని  పెద్దల బెదిరింపులనే ఆశీర్వాదాలనుకున్నారు. అమ్మానాన్నలయ్యారు. కోపం తగ్గని అమ్మానాన్నల్ని అమ్మమ్మ,తాతయ్యల్ని చేసేసామని సంబరపడ్డారు. మనబిడ్డ మనవాళ్ళందరినీ ఒక్కటిచేస్తాడని ఆశ పడ్డారేమో...పాపం పసివాళ్ళు అంతకుమించి యేమీ అనుకోనుండరు. కాని... "మనం వద్దనుకున్న కుళ్ళు తో కళ్ళుమూసుకుపోయి  కబళించడానికి    మన-తన అన్నబేధంమరచి మృగాలుగా మారిపోతారనిమాత్రం ఊహించివుండరు.  ముక్కూమొహంతెలీకపోయినా పసుపుబట్టల్లో పచ్చగా కనిపించిన పిల్లల్ని చూసి చల్లగా వుండమని ఆశీస్సులివ్వాలిగాని...కడుపునపుట్టినపిల్లల్నే కాదనుకుని వేటేయడానికి వీళ్ళకు  మనసెలావచ్చిందో... 
  

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు